Thursday, June 18, 2020

మీరు చేసే పని ఏమిటి? -- మీ అభిమాన నాయకునికి ప్రశ్న

సామాజిక శాస్త్రంలో మొదటిమాట "పరిసరాల పరిశుభ్రత" -- అది చేసే వాళ్ళు, తాము ఈ సమాజంలో పనికిమాలిన పని చేస్తున్నాం అని, మెమే అందరికంటే తక్కువస్థాయిలో వున్నాం అని భావిస్తున్నారు.
చెప్పులు కుడుతూ చచ్చిన జీవులను దహనం చేసి, సమాజానికి రోగాలను దూరం చేస్తూ, మనుషుల పాదాలకు రక్షణ ఇచ్ఛే పని కూడా పనికిమాలినది అని మానేశారు.
జుట్టు కత్తిరించి, గోళ్లు తీసి ప్రతి మనిషిని సమాజంలో అందంగా చూపించే వాళ్ళూ, ఎందుకొచ్చిన తలనొప్పి అంటున్నారు.
వడ్రంగి పని చేస్తూ ప్రతి ఇంటి ముఖద్వారాలను అందంగా తీర్చిన వాళ్ళూ తమ పని ఎందుకూ పనికిరాదు అంటున్నారు.
పొలాలకు కాపుకాచి పంట వార్చి ఇంటికి తెచ్చే వాళ్ళూ మేము చాలా తక్కువ పని చేస్తున్నాం, ఇక ఎప్పటికీ ఈ పని చేయం అంటున్నారు.
పొలాలు దుక్కి దున్ని, పంట వేసి, నీరు పెట్టి, పండించే వాళ్ళూ ఇక లాభం లేదు, ఈ పని ఎవరికోసం అంటున్నారు.
దేవుడికి పూజ చేసి, సమాజానికి స్వాంతన కలిగించే వాళ్ళూ మాకెవ్వరు దిక్కు అంటున్నారు.
కర్మాగారాలలో పని చేసే కార్మికులూ దీనికంటే వేరే ఏ పని అయినా మంచిదేమో అని భావిస్తున్నారు.
శారీరక శ్రమ చేసే ప్రతి మనిషి తన ఆలోచనలతో అలిసి పోతూవుంటే,తాము చేసే పని ఏమిటో తెలియని రాజకీయ నాయకులు మాత్రం మేము చేసిందే పని, మెమే గొప్ప అంటున్నారు.

ప్రజలారా -- ఈ సారి అవకాశం వస్తే, మీరు అభిమానించే నాయకుడిని అడగండి -- "మీరు చేసే పని ఏమిటి?" అని
ఇట్లు -- మీ రాజా

Monday, May 25, 2020

దేశం -- వ్యవస్థ

భారత దేశంలో వ్యవస్థ సొంత ఆలోచనలతో వెళ్లడం 2000 సంవత్సరంతో ముగినిసినట్లు వుంది. ఏదైనా పాశ్చాత్య దేశాలలో చేస్తే, వెంటనే మన దేశంలో చేసేయాలి. మంచి, చెడు ఆలోచన తరవాత. ప్రపంచానికి మన వ్యవస్థ పెద్ద ప్రయోగశాలగా మారి పోతోంది. మన చదువు తప్పు అని, చదివితే  ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలని మన ప్రభుత్వ పెద్దలు తీర్మానించేసారు. ఇక్కడ చదవాలి బయట దేశంలో ఉద్యోగం చేయాలి. ఇదే మన కొత్త వ్యవస్థ. నువ్వు చదివే చదువు నీకుగానీ , నీ కుటుంబానికి గానీ, నీవు చూస్తున్న వ్యవస్థకు గానీ , దేశానికి గానీ అవసరమా అంటే: మొదటి రెండింటికీ ఆర్థికంగా కొంచెం ఉపయోగం కానీ, చివరి రెండింటికీ పెద్ద నష్టం చేశాయని చెప్పుకోవాలి.
౩౦౦ వందల సంవత్సరాలు ఆంగ్లేయులను ఎదిరించి నిలిచిన భాష, సంస్కృతి, గత 20 సంవత్త్సరాలలో పూర్తిగా ధ్వంసం చేసేసాం. ఇంకా నేలపై వున్నా చిన్న చితకా గురుతులను కూడా చిదిమేస్తున్నాం..
నా భారతదేశం ఎప్పటికీ బలంగా సొంత ఆలోచన విధానాలతో ఉండాలని అభిలషిస్తూ -- మీ రాజా 

Monday, May 4, 2020

మనసులోని మాట


మనిషి ప్రకృతికి దూరంగా బ్రతకడం చాలాసుఖం అని భావించాడు. కొంచెం ఎండ తగిలినా, గాలి తిగిలినా, దుమ్ము తగిలినా లేక వాన తగిలినా అదేదో కష్టమన్నట్లు తనని తాను నానా రకాలుగా కప్పేసుకొని సుఖపడుతున్నట్లు భ్రమ పడుతున్నాడు. చేసే పనిలో కూడా ఎక్కడా ఎండ, గాలి, దుమ్ము , వాన తగలకూడదు. అలా ఎవైరైనా పని చేస్తుంటే, వాళ్ళని తక్కువగా చూడటం సమాజంలో పరిపాటిగా మారింది. అదే ఇప్పుడు మనిషి పట్ల శాపంగా మారుతున్నది.
ప్రకృతి ద్వారా సమకూరే కొన్ని సహజసిద్ధమైన శక్తులు మానవులకు తప్ప మిగతా అన్ని జీవరాశులకూ సంక్రమిస్తున్నాయి. మన పూర్వీకులు, ఏర్పాటు చేసిన వ్యవస్థలో, అన్ని ప్రకృతితో మమేకమై మానవాళి ఉనికికి దోహదపడ్డాయి. మన సంప్రదాయాలు మనకు ఎలాంటి దుస్తులు, ఎలాంటి తిండి మన వాతావరణానికి సరిపోతాయో తెలియజేస్తాయి. కానీ మనం చలి ప్రదేశాలలో వాడే దుస్తులను ఆధునిక నాగరికతగా భావించి అలాంటి దుస్తులు తిండి అలవాటు చేసుకొంటున్నాము.
కొంతమంది మన తిండిని బట్టను తప్పుపడుతూ ప్రసార మాధ్యమాలలో వాళ్ళ స్వలాభం కోసం చెబుతూ ఉంటే, చాలామంది చదువుకొన్న వాళ్ళు మారి అందరిని మారే టట్లు చేస్తున్నారు. ఒకప్పుడు వరి అన్నం దొరికితే గొప్ప అయితే ఇప్పుడు అది పెద్ద తప్పు. తింటే చపాతి తినాలి లేకుంటే ఏదైనా సిరి ధాన్యాలు తినాలి. ఎందుకంటే ప్రసార మాధ్యమాలలో ఇప్పుడు దానినే ఊదర కొడుతున్నారు కాబట్టి. నిజానికి అన్నిటికంటే అన్నం తొందరగా అరిగిపొతుంది. తొందరగా శరీరానికి బలం చేకూరుస్తుంది. రొట్టెలు మరియు చపాతీలు లాంటివి అరగటానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అవి తింటే మనం చేసే శారీరక శ్రమ కూడా ఎక్కువ ఉండాలి.
మన సంస్కృతి అంటే:
1 . మన భాష.
2 . మన తిండి.
3 . మన వేషం.
ప్రపంచంలో ఎక్కడైనా నిన్ను ఎక్కడి వారు అని గుర్తించడానికి పై మూడే ఆధారం.

గత  30 సంవత్సరములలో మనం వేసుకొనే బట్టలు 99 శాతం మారిపోయాయి. తిండి 50 శాతం మారిపోయింది. భాష 30 శాతం మారిపోయింది. ఇది నా అంచనా మాత్రమే.
ఆలోచించండి వీలైతే మీ సంస్కృతిని తిరిగి మొదలు పెట్టండి.

జ్ఙాపకం


దివాకరం వయస్సు 10 సంవత్సరాలు ఉండగా జరిగిన సంఘటన
బడి వదిలిన తరవాత ఇంటికి వచ్చిన దివాకరం తన స్నేహితుడైన రమేష్ ని ఆడుకొందాం అని పిలిస్తే, మా అమ్మ నీతో ఆడుకోవధ్ధు అన్నది అని చెప్పగానే దివాకరానికి ఎక్కడలేని కోపం వచ్చింది. సరే నేను సుబ్రహ్మణ్యం తో ఆడుకుంటాలే అని బయలుదేరాడు. సుబ్రహ్మణ్యం తన కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు అలాగే రమేష్ లాగా కాకుండా తన మాట వింటాడు అనే సంతోషం.
సుబ్రహ్మణ్యం తో కలిసి వంక దగ్గరకి వెళ్లి ఆడుకొందాం అని చెప్పగా, అది విన్న వాళ్ళ అమ్మమ్మ నీళ్ల దగ్గర జాగ్రత్త అని చెప్పి పంపింది. వంకలో కొంచెం సేపు ఇసుకతో  ఆడుకున్నతరువాత, నీళ్ల దగ్గరకు వెళ్లగా అక్కడ కొన్ని చేపలు, అలాగే తోక కప్పలు కనిపించాయి. వాటిని చూస్తూ కొంచెం సేపు ఆడుకున్న తరువాత, తెలియకుండానే నీళ్ళలోకి ఇద్దరూ దిగారు. చిన్నగా చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా, వంకలో గత సంవత్స్తరం మట్టి కోసం తీసిన పెద్ద గోతులు వున్నవిషయం తెలియక, అలాగే కొంచెం బురదగా ఉండటంతో నీళ్ల లోతు కూడా తెలియలేదు.
సుబ్రహ్మణ్యం వద్దురా అంటున్నా, ఇక్కడ ఏమీ లోతు లేదు అంటూ ఇంకా లోపలికి వెళ్తున్నాడు. వున్నట్లుండి, కనపడటం లేదు. అంతే, దివాకరం గుండెలు జల్లు మన్నాయి. ఇప్పుడు ఏమి చేయాలి?. అటు ఇటు చూడగా సుబ్రహ్మణ్యం మునిగిన చోటుకి అవతలి గట్టుకి రెండు మూరలు వుంది అంతే. మరేమీ ఆలోచించకుండా వెంటనే నీళ్లలో నడుచుకొంటూ వెళ్ళాడు. ఊపిరి బిగబట్టి సుబ్రమణ్యాన్ని ఒడ్డుకి తీసుకొచ్చాడు. అప్పటికి ఎంతో సమయం కాకపోవడం తో సుబ్రమణ్యానికి ఏమీ కాలేదు. లేచి కూర్చొని "అన్న నాకు ఏమైంది" అన్నాడు.
నువ్వు నీళ్లలో మునిగి పోయావు. దేవుడి దయవల్ల ఇద్దరం బతికి బయట పడ్డాం. విషయం ఎవరితో చెప్పొద్దు ముఖ్యంగా మీ అమ్మమ్మకి. సరే అన్న అన్నాడు సుబ్రహ్మణ్యం.
బతుకు జీవుడా అంటూ ఇంటికి బయలుదేరారు ఇద్దరూ.
సశేషం
అందరికీ వందనాలు

అమెరికాలో ఆంధ్రుడు -- ఇది ఒక సాఫ్ట్ వేర్ భర్త కధ


నిద్రలేచిన రామారావుకి  ఈరోజు ఎలావుంటుందో అని చిన్న గిలి మొదలైంది. సరే చేసేది ఏమీలేదు కనుక  తన రోజువారీ పనులు మొదలు పెట్టాడు. ఏమోయ్ కాఫీ కాఫీ ఇవ్వు అందాం అనుకొని, గతం గుర్తుకొచ్చ్చి, తన కాఫీ తనే కలుపుకొని కొంచెం తన భార్యకుకూడా ఇచ్చాడు. కాఫీ తాగుదాం అనుకొనే  లోపల పిల్లలు గుర్తుకొచ్చి, వాళ్ళని నిద్రలేపి పాఠశాలకు వెళ్ళడానికి తాయారు చేసాడు. సరే, పిల్లలు రొట్టె ముక్క తినడానికి కొంచెం గోల చేసినా, ఎలాగోలా బెదిరించి తినేటట్లు చేసి పాఠశాల వాహనం ఎక్కించాడు. తీరా చూస్తే కాఫీ చల్లారిపోయింది, సరేలే అని కొంచెం తాగి, కొంచెం వదిలేసాడు.

ఇంతలో తన కార్యాలయం గుర్తుకొచ్చి, ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని బయలుదేరాడు. వెళ్ళగానే తన జట్టు చేసే పని గుర్తుకొచ్చి రోజు ఏమిచేయాలి అని ఆలోచిస్తుంటే, ఉదయపు సమావేశ పట్టిక నుండి ఒక సమాచారం తన ముందు కనిపించింది. సమావేశానికి వెళ్ళగానే అందరూ ముఖాలు ఒక సారి చూసి అందరిని ఒకసారి పలకరించి తన ఆసనంలో ఆసీనులయినాడు. పైఅధికారి రాగానే అందరూ ఆసక్తిగా తనని చూడగా, సభ మొదలు పెట్టమని సంకేతం రాగానే, అందరూ తమ తమ గత రోజు చరిత్ర చెప్పడం మొదలు పెట్టారు. ఈరోజు ఏమి చేయాలో దిశానిర్ధేశం చేసాక సభ ముగిసినది. తనకు ఇష్టమైన సహచరుడితో కాఫీ కి బయలుదేరాడు. కొంచెంసేపు ముచ్చట్ల తరువాత, కాఫీ తాగి, తనకు నిర్ధేశించిన ఆసనంలో కూర్చొని, రోజు పని మమ అనిపించి ఇంటికి చేరాడు.

పిల్లలు గుత్తుకొచ్చి, వెంటనే సాయంకాలపు పిల్లల సంరక్షణ కేంద్రం నుండి పిల్లలను తీసుకొచ్సి, కొంచెం ఫలహారం ఇచ్చి వారిని శాంత పరిచాడు. ఇల్లు అంతా పరికించి చూడగా, చాలా చెత్త పేరుకుపోయింది. ధూళి లాగు యంత్రం తీసుకొని అంతా శుభ్రం చేసాడు. ఇంతలో తన భార్య భోజనం తయారైనది అని పిలుపు ఇచ్చినది. ఇంక తిని పడుకొందాం అనుకొనేలోపల, రేపు గుర్తుకొచ్చి, అన్య మనస్కంగా కొంచెం తిని రేపు ఎలా అని పడుకొన్నాడు .

అంతే మళ్లీ తెల్లారింది .. మల్లీ కథ మొదలైనది.. సశేషం
అందరికి వందనాలు

అందమైన రోజు


నిద్ర లేచిన వెంటనే వచ్ఛే మంచి గాలి
తరవాత తాగే మంచి కాఫీ
రద్దీ లేని రహదారులు
కనపడగానే పలకరించే కార్యాలయ సిబ్బంది
అనుకున్నట్లు పని పూర్తి కావడం
పిల్లలతో కాసేపు అడ్డుకొన్న సాయంత్రం
సమయానికి వఛ్చిన నిద్ర
ఇలా జరిగేతే అది ఒక అందమైన రోజే కాదు అద్భుతమైన రోజే
అందరికీ వందనాలు