Monday, May 4, 2020

మనసులోని మాట


మనిషి ప్రకృతికి దూరంగా బ్రతకడం చాలాసుఖం అని భావించాడు. కొంచెం ఎండ తగిలినా, గాలి తిగిలినా, దుమ్ము తగిలినా లేక వాన తగిలినా అదేదో కష్టమన్నట్లు తనని తాను నానా రకాలుగా కప్పేసుకొని సుఖపడుతున్నట్లు భ్రమ పడుతున్నాడు. చేసే పనిలో కూడా ఎక్కడా ఎండ, గాలి, దుమ్ము , వాన తగలకూడదు. అలా ఎవైరైనా పని చేస్తుంటే, వాళ్ళని తక్కువగా చూడటం సమాజంలో పరిపాటిగా మారింది. అదే ఇప్పుడు మనిషి పట్ల శాపంగా మారుతున్నది.
ప్రకృతి ద్వారా సమకూరే కొన్ని సహజసిద్ధమైన శక్తులు మానవులకు తప్ప మిగతా అన్ని జీవరాశులకూ సంక్రమిస్తున్నాయి. మన పూర్వీకులు, ఏర్పాటు చేసిన వ్యవస్థలో, అన్ని ప్రకృతితో మమేకమై మానవాళి ఉనికికి దోహదపడ్డాయి. మన సంప్రదాయాలు మనకు ఎలాంటి దుస్తులు, ఎలాంటి తిండి మన వాతావరణానికి సరిపోతాయో తెలియజేస్తాయి. కానీ మనం చలి ప్రదేశాలలో వాడే దుస్తులను ఆధునిక నాగరికతగా భావించి అలాంటి దుస్తులు తిండి అలవాటు చేసుకొంటున్నాము.
కొంతమంది మన తిండిని బట్టను తప్పుపడుతూ ప్రసార మాధ్యమాలలో వాళ్ళ స్వలాభం కోసం చెబుతూ ఉంటే, చాలామంది చదువుకొన్న వాళ్ళు మారి అందరిని మారే టట్లు చేస్తున్నారు. ఒకప్పుడు వరి అన్నం దొరికితే గొప్ప అయితే ఇప్పుడు అది పెద్ద తప్పు. తింటే చపాతి తినాలి లేకుంటే ఏదైనా సిరి ధాన్యాలు తినాలి. ఎందుకంటే ప్రసార మాధ్యమాలలో ఇప్పుడు దానినే ఊదర కొడుతున్నారు కాబట్టి. నిజానికి అన్నిటికంటే అన్నం తొందరగా అరిగిపొతుంది. తొందరగా శరీరానికి బలం చేకూరుస్తుంది. రొట్టెలు మరియు చపాతీలు లాంటివి అరగటానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అవి తింటే మనం చేసే శారీరక శ్రమ కూడా ఎక్కువ ఉండాలి.
మన సంస్కృతి అంటే:
1 . మన భాష.
2 . మన తిండి.
3 . మన వేషం.
ప్రపంచంలో ఎక్కడైనా నిన్ను ఎక్కడి వారు అని గుర్తించడానికి పై మూడే ఆధారం.

గత  30 సంవత్సరములలో మనం వేసుకొనే బట్టలు 99 శాతం మారిపోయాయి. తిండి 50 శాతం మారిపోయింది. భాష 30 శాతం మారిపోయింది. ఇది నా అంచనా మాత్రమే.
ఆలోచించండి వీలైతే మీ సంస్కృతిని తిరిగి మొదలు పెట్టండి.

No comments: