Monday, May 4, 2020

అమెరికాలో ఆంధ్రుడు -- ఇది ఒక సాఫ్ట్ వేర్ భర్త కధ


నిద్రలేచిన రామారావుకి  ఈరోజు ఎలావుంటుందో అని చిన్న గిలి మొదలైంది. సరే చేసేది ఏమీలేదు కనుక  తన రోజువారీ పనులు మొదలు పెట్టాడు. ఏమోయ్ కాఫీ కాఫీ ఇవ్వు అందాం అనుకొని, గతం గుర్తుకొచ్చ్చి, తన కాఫీ తనే కలుపుకొని కొంచెం తన భార్యకుకూడా ఇచ్చాడు. కాఫీ తాగుదాం అనుకొనే  లోపల పిల్లలు గుర్తుకొచ్చి, వాళ్ళని నిద్రలేపి పాఠశాలకు వెళ్ళడానికి తాయారు చేసాడు. సరే, పిల్లలు రొట్టె ముక్క తినడానికి కొంచెం గోల చేసినా, ఎలాగోలా బెదిరించి తినేటట్లు చేసి పాఠశాల వాహనం ఎక్కించాడు. తీరా చూస్తే కాఫీ చల్లారిపోయింది, సరేలే అని కొంచెం తాగి, కొంచెం వదిలేసాడు.

ఇంతలో తన కార్యాలయం గుర్తుకొచ్చి, ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని బయలుదేరాడు. వెళ్ళగానే తన జట్టు చేసే పని గుర్తుకొచ్చి రోజు ఏమిచేయాలి అని ఆలోచిస్తుంటే, ఉదయపు సమావేశ పట్టిక నుండి ఒక సమాచారం తన ముందు కనిపించింది. సమావేశానికి వెళ్ళగానే అందరూ ముఖాలు ఒక సారి చూసి అందరిని ఒకసారి పలకరించి తన ఆసనంలో ఆసీనులయినాడు. పైఅధికారి రాగానే అందరూ ఆసక్తిగా తనని చూడగా, సభ మొదలు పెట్టమని సంకేతం రాగానే, అందరూ తమ తమ గత రోజు చరిత్ర చెప్పడం మొదలు పెట్టారు. ఈరోజు ఏమి చేయాలో దిశానిర్ధేశం చేసాక సభ ముగిసినది. తనకు ఇష్టమైన సహచరుడితో కాఫీ కి బయలుదేరాడు. కొంచెంసేపు ముచ్చట్ల తరువాత, కాఫీ తాగి, తనకు నిర్ధేశించిన ఆసనంలో కూర్చొని, రోజు పని మమ అనిపించి ఇంటికి చేరాడు.

పిల్లలు గుత్తుకొచ్చి, వెంటనే సాయంకాలపు పిల్లల సంరక్షణ కేంద్రం నుండి పిల్లలను తీసుకొచ్సి, కొంచెం ఫలహారం ఇచ్చి వారిని శాంత పరిచాడు. ఇల్లు అంతా పరికించి చూడగా, చాలా చెత్త పేరుకుపోయింది. ధూళి లాగు యంత్రం తీసుకొని అంతా శుభ్రం చేసాడు. ఇంతలో తన భార్య భోజనం తయారైనది అని పిలుపు ఇచ్చినది. ఇంక తిని పడుకొందాం అనుకొనేలోపల, రేపు గుర్తుకొచ్చి, అన్య మనస్కంగా కొంచెం తిని రేపు ఎలా అని పడుకొన్నాడు .

అంతే మళ్లీ తెల్లారింది .. మల్లీ కథ మొదలైనది.. సశేషం
అందరికి వందనాలు

No comments: